AP Skill Census 2024 Scheme Details
AP Skill Census 2024 Scheme Details
చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి?
ఇందులో ఏం చేస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం స్కిల్ సెన్సస్ (నైపుణ్య గణన)కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలుత చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సస్ ఫైల్ కూడా ఉంది.
సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ నోటిఫికేషన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటుగా స్కిల్ సెన్సస్ (నైపుణ్య గణన)కు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చంద్రబాబు చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జీవో నంబర్.13 కూడా విడుదలైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరఫున జూన్ 13న ఈ జీవోను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేయాలని ఆదేశించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా స్కిల్ సెన్సస్ జరుగుతుందని ఆ జీవోలో పేర్కొన్నారు.
జూన్ 24న జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో స్కిల్ సెన్సస్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. యువతలో నైపుణ్యాలను అర్థం చేసుకునేందుకు అనుగుణంగా స్కిల్ సెన్సస్ చేయాలని తీర్మానించారు.
ఇంతకీ ఈ స్కిల్ సెన్సస్ అంటే ఏమిటీ? దాని వల్ల ప్రయోజనం ఏమిటీ? ఎందుకు చేస్తున్నారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
అందులోనూ దేశమంతా కులగణన గురించి అనేక డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ‘నైపుణ్య గణన’ చేస్తామని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్కిల్ సెన్సస్ ఎవరి కోసం?
యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందుంది. అదే సమయంలో నిరుద్యోగం సమస్య కూడా తీవ్రంగా ఉంది.
పనిచేయగల శక్తి ఉన్నప్పటికీ, సామర్థ్యానికి అనుగుణంగా ఉపాధి లభించడం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. దాంతో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కూడా నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది. లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం దేశ సగటు కన్నా ఏపీలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 15 ఏళ్ల పైబడిన వారిలో ఉపాధి లేమి సమస్య 4.1 శాతం ఉన్నట్లు తేల్చారు. జాతీయ సగటు 3.9 శాతంగా ఉంది.
అదే సమయంలో బిహార్‌లో ఇది 3.9 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 2.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.6 శాతం మాత్రమే ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
ఇక యువతలో నిరుద్యోగం దేశవ్యాప్తంగా 10 శాతం ఉంటే, ఏపీలో 15.7 శాతంగా నమోదైంది.
పట్టభద్రులైన వారిలో ఏపీలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా, బిహార్‌లో 16.6 శాతం, యూపీలో 11 శాతం, మధ్యప్రదేశ్‌లో 9.3 శాతం, రాజస్తాన్‌లో 23.1 శాతం ఉంది.
అంటే దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా, ఉత్తరాదిన వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే వాటితో పోల్చినా ఏపీలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
దాంతో యువతలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకుంటే, దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్న లక్ష్యంతో స్కిల్ సెన్సస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఎందుకు చేస్తున్నారు?
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) రూపొందించిన ‘ఇండియాస్ స్కిల్లింగ్ పారడాక్స్’ 2018లో తొలుత స్కిల్ సెన్సస్ గురించి ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో అవకాశాలు, తయారీ, సర్వీస్ రంగంలో ఉన్న మార్గాలను అన్వేషిస్తూ వాటికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కీలకమని ఆ నివేదిక చెబుతోంది.
దానికి తగ్గట్టుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణన-2024 నిర్వహణకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కాలేజీలు, 1,400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఒకేషనల్ అండ్ ఐటీఐ కాలేజీలున్నాయి. ఏటా ఆయా విద్యా సంస్థల నుంచి దాదాపు 4.4 లక్షల మంది కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఏపీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది.
“మార్కెట్ డిమాండ్, సప్లై ఆధారంగా యువతను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం స్కిల్ ఉన్న యువత లభించడం లేదు. అనేక రంగాలకు నిపుణుల కొరత ఉంది. అదే సమయంలో ఆయా అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యత యువతలో కనిపించడం లేదు. అందుకే స్కిల్ గ్యాప్‌ని అంచనా వేయాలని నిర్ణయించాం. యువతను భవిష్యత్తుగా తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే స్థాయిలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలంటే ప్రస్తుతం వారి స్థాయిని గమనంలోకి తీసుకోవాలి. అందుకే స్కిల్ సెన్సస్ చేయాల్సి వస్తోంది” అని ఏపీ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు.
పారిశ్రామిక అనుబంధ సంస్థలు, వ్యవసాయ రంగం, మార్కెటింగ్ సంస్థలు, ప్రొడక్షన్ సంస్థలు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యాలను పెంపొందిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు అనేక అవకాశాలు దక్కుతాయని ఆయన బీబీసీతో చెప్పారు.
ఎప్పుడు చేస్తారు?
మూడు, నాలుగు నెలల్లో నైపుణ్య గణనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది? అలాంటి నైపుణ్యం కలిగిన వారు ఎంత మంది ఉన్నారు? డిమాండ్‌కు, లభ్యతకు మధ్య అంతరం ఎంత ఉంది? వంటి విషయాలను అంచనా వేయగలమని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ డిజైన్ చేసేందుకు తోడ్పడుతుందని భావిస్తోంది.
“స్కిల్ సెన్సస్ ద్వారా యువతలో నైపుణ్యాలను గుర్తిస్తాం. అవసరమైన మేరకు మెరుగుపరిచే కృషి చేస్తాం. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాం. అదే అసలైన అభివృద్ధి. నిజమైన సంక్షేమం. యువత తన కాళ్లపై తాము నిలబడేందుకు అనుగుణంగా దీనిని రూపొందించాం. ఇది వారి రూపురేఖలు మార్చబోతోంది. ఏఐ, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఆర్, వీఆర్ వంటి వాటిలో యువతకు తర్ఫీదునిస్తే వారే దూసుకుపోతారు” అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
స్కిల్ సెన్సస్ ద్వారా డేటా సేకరిస్తే, అదే మెరుగైన ఫలితాలను తీసుకొచ్చే మార్గం ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు.
ఎవరు చేస్తారు?
స్కిల్ సెన్సస్‌లో భాగంగా ”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఇంట్లో యువతను గుర్తించి, వారి విద్యార్హతలు, వారి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటారు. వారి జీవనం మెరుగుపరిచేందుకు ఉన్న మార్గాలను ఆన్వేషిస్తారు” అని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు.
“ప్రభుత్వం స్కిల్ సెన్సస్‌కు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. గణనకు సంబంధించిన విధాన ప్రక్రియకి తుది రూపు ఇవ్వాల్సి ఉంది. దానికి అనుగుణంగా కసరత్తు జరుగుతోంది. ఎవరు గణన చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారన్నది తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర గడిచిన కొన్నేళ్లుగా వివిధ విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థుల డేటా ఉంది. దాని ఆధారంగా వారి వివరాలు సేకరించే ప్రక్రియ జరుగుతుంది” అంటూ ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు చెబుతున్నారు.
తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభుత్వంతో చర్చించి సెన్సస్ చేసే విధానం గురించి స్పష్టత ఇస్తామని ఆ సంస్థ చెబుతోంది.
‘ఆలోచన మంచిదే, ఆచరణలో తేలాలి’
ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సస్‌కు శ్రీకారం చుట్టడం ఆశావాహకంగా కనిపిస్తోందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ రంగనాథ్ అన్నారు.
“యువతలో నైపుణ్య గణనకు ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గది. కానీ అది సమగ్రంగా చేయాలి. అరకొరగా చేసి సరిపెడితే ఉపయోగం ఉండదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇలాంటి ప్రయత్నం తోడ్పడుతుంది. ప్రభుత్వ కృషి దానికి తగ్గట్టుగా ఉండాలి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినా గతంలో అవి పూర్తి ఫలితాన్నివ్వలేదు. అరకొర చర్యలతోనే సరిపెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా సమగ్రంగా యువత భవితను తీర్చిదిద్దేలా సాగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది” అంటూ రంగనాథ్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో 15 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న యువత సుమారుగా కోటి 20 లక్షల మంది ఉంటారని, వారందరి వివరాలు సేకరించడం ద్వారా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ రంగనాథ్ అన్నారు.
Tags : Ap Skill Census 2024 Scheme Details, ap skill development centre, ap skill development courses list, skill universe.apssdc.in login, ap skill census recruitment, ap skill census register, Ap Skill Census, Ap Skill Census, Ap Skill Census, Ap Skill Census, Ap Skill Census 2024 Scheme Details.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.